పుట్టిన ప్రతిప్రాణి జీవించుటకు నిరంతరము ప్రయంత్నించుచుండును.  ప్రాణకోటిలో మహాశక్తియుతుడైన మానవుడు దేహబలము, బుద్ధిబలం జోడించి మనుగడ సాగించుచుండును.  బుద్ధి, సంస్కారము, కార్యదీక్ష, పరాక్రమము మేళవించిన మానవోత్తముడు అంతయూ తన ప్రజ్ఞ వలననే నేరువేరుచున్న దనుకొని విర్రవీగాసాగినాడు.  కాని అనతికాలములోనే మానవశక్తికి అతీతమయిన మహాశక్తి ఒకటి యున్నదని గ్రహించి చింతింపసాగినాడు.  ఆ చింతనలో నుండియే ఆత్మ విచారము, మతము ఆవిర్భవించినవి.  మానవ జీవిత గమనమునకు నియము నిబంధనలను ఏర్పరచినవి.  అవియే మానవజాతికి మకుటములేని రాజులైనవి.

తెల్లవారి లేచినప్పటినుంచి రాత్రి నిద్రకుసక్రమించు వరకు మనుష్యకోటి కూటికొరకు, బట్టకొరకు, ఇంటికొరకు, దబ్బుకొరకు పరితపించుచు ఆశాపాశాములతో బంధింపబడి యుండును.  కామ, క్రోధ, లోభ, మోహ మదమాత్సర్యములతో దుఃఖముల పాలగుచుండును.  ఈ అరిష్టములనుండి మానవుని దృష్టి మరలంచి నిరాశా నిశ్పహలు తొలగించి ఆశాజ్యోతిని వెలిగించి సరాశాయముతో మత కర్తలు పండుగలను, పర్వములను ఏర్పాటు చేసిరి.

పండుగలు అనేక విధములగా రూపొందినవి.  కాల చక్రములోని, మార్పును నిర్దేశించు ఉగాది లేక సంవత్సరాదితో పండుగ సంప్రదాయము ప్రారంభమయినది.  కర్కాటక సంక్రమణము, మకర సంక్రమణము లేక సంక్రాంతి యనునవి కాలమునుబట్టి ఏర్పడినవి.  శ్రీరామనవమి, కృష్ణాష్టమి వంటివి మహాపురుషుల సంస్కరనార్ధ మేర్పడి యున్నవి.  వినాయకచవితి, నవరాత్రులు, శివరాత్రి దేవతారాధన కేర్పడినవి.  దీపావళి దుష్టసంహారకుల దివ్య స్మతికై జరుగుచున్నవి.  ఈ పండుగలు స్త్రీ, పురుష బేధము లేకుండా అందరూ ఆచరింపదగి యున్నవి.  కొన్ని పండుగలు ప్రత్యేకముగా స్త్రీల కొరకేర్పడినవి.  శ్రావణ మాసమందు మంగళవారంనాడు, శుక్రవారంనాడు మంగళగౌరిని, వరలక్ష్మిని పూజింతురు.  ఉండ్రాళ్ళు తదియ, అట్లతదియ, ఆడ పిల్లలకు పండుగరోజులు.  నాగులచవితి, సుబ్రహ్మన్యషష్టి నాగపూజకు నిర్దేశించబదినవి.  ఇవన్నియు హిందూ మతములోని ముఖ్యమైన పండుగ దినములు.
భారత దేశములో హిందూ మతముతో బాటుగా మహామ్మదీయమతము, క్రైస్తవ మతము, బౌద్ధమతము, సిక్కు మతము, పార్శీమతము, యూదు మతములు గూడ ప్రచారములో నున్నవి.  హిందూ మతములో వాలెనే వివిధ మతములవారికి వేరు వేరు పండుగలు గలవు.  మహమ్మదీయులకు రంజాను, బక్రీదు, మొహరం వంటివి, క్రైస్తవులకు సంవత్సరాది, గుడ్  ఫ్రైడే, క్రిస్మసు వంటివి, బౌద్దులకు బుద్ధ జయంతి వంటివి పెక్కు పండుగలున్నవి.
పండుగలవలన అనేక ప్రయోజనములున్నవి.  సుర్యాదిగ్రహముల చలనముల గుర్తించుటవలన కాలగమనము తెలిసికొనుచున్నారు.  వీరులను గుర్తించుటవలన ఆరింధించుట వలన జాతికి శౌర్య పరాక్రమాదుల కలుగును.  దేవతాధన వలన ఆధ్యాత్మిక చింతన ప్రబలును.  కర్మాచరనమునందు శ్రద్ధ యేర్పడును.  నిత్యజీవితములోని కష్టములను మరచిపోయి మానసికోల్లసము జనించును.  విశ్రాంతి, వినోదము చేకూరును.  ఉన్నవారుగాని పేదవారుగాని తమ కలిమిలేములను అవలకు నెట్టి తలంటి పోసుకుని ఆరోగ్యమును పొందుదురు.  శ్రమపడి సంపాదించుకున్న దానిలో కొంత ఖర్చు చేసి పిండి పంటలతో భుజింతురు.  కొత్త బట్టలు కట్టుకొని ఆనందింతురు.  ఇళ్ళు వాకిళ్ళు శుభ్రము చేసి అలంకరించు కొందురు.  ఈ విధముగా దుఃఖమయ మానవ జీవితములో పండుగలు వెలుగు రేఖలను ప్రసరింపజేయును.  ఆటలు, పాటలు, సమావేశములు, వేడుకలు, ఉత్సవములు, సాంస్కృతిక సమావేశములు, సంగీత నాటక కార్యక్రమములు జరిగి ఉత్సాహము లభించును.
వివిధ మతస్థులు ఆ మతాచారములను పాటించుచు తమతమ పండుగలను జరుపుకొనుచుందురు.  బహు మతమములకు నిలయమయిన మనదేశము నందు హిందువులు, మహమ్మదీయులకు ద్వేషముతో కలహములకు దిగుచుందురు.  హత్యలు, గృహదహనములు, లూటీలు జరిపి పలు నష్టములు కలిగించుచున్నారు.  ఇట్టి చర్యలవలన మతములకు వైముఖ్యము, పండుగలని నిరాదరణ పెరుగును.  ఆయా మతములకు చెందినవారు ఆవేశము చంపుకొని నిగ్రహము నలవరచుకొనుట మంచిది.
పామర జనము పండుగ దినముల పరమార్ధమును మరచిపోయి మూడముగా ప్రవర్తించుచుందురు.  గొర్రెలు, మేకలు, పందులు, కోళ్ళు మొదలగు వానిని వదించుట, కల్లు, సారాయివంటి మద్యములను దేవతాప్రీతికై సమర్పించుట సిగ్గుచేటు.  కొందరు పొట్టేలు పందెములు, కోడి పందెములు, జుదములాడుచుందురు.  ఇవిగూడ నష్టదాయకము గనుక మానివేయ వలెను.
ఏ పండుగ అయినను ఒక ప్రదానాశయముతో ఏర్పడియుండును.  వానిని తెలేసికొని ఆచరింపవలెను.  ఏదో పండుగ వచ్చినదనుకొని బాహ్యాడంబరములు, పిండివంటలు భోజనము, క్రొత్త బట్టల సంబరముతోనే తృప్తి పడరాదు.  పండుగల తత్త్వము గుర్తించి ఆచరించిన ఎడల వ్యక్తికి, కుటుంబమునకు, జాతికీ నుతనోత్తేజము లభించును.  జీవితము ఉజ్జ్వల మగును.

Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments